Home  »  Bollywood News  »  Bhooth Bangla: ఓటీటీలోకి వచ్చేసిన భూత్ బంగ్లా.. పెళ్లి కూతుళ్లను ఎత్తుకెళ్లిపోయే దెయ్యం కథ!

Updated : Jun 12, 2026

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar), సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్ అనగానే మనకు ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలు గుర్తొస్తాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'హేరా ఫేరి' (2000), 'గరం మసాలా' (2005), 'భాగం భాగ్' (2006), 'భూల్ భులైయా' (2007), 'దే దనా దన్' (2009), 'ఖట్టా మీఠా' (2010) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సూపర్ హిట్ కాంబో నుంచి వచ్చిన తాజా హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'భూత్ బంగ్లా' (Bhooth Bangla). థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఈ క్రేజీ మూవీ థియేట్రికల్ రిలీజ్ విషయానికి వస్తే, ఏప్రిల్ 16 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మిశ్రమ సమీక్షలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించి హిట్‌గా నిలిచింది. ట్రేడ్ లెక్కల ప్రకారం, 'భూత్ బంగ్లా' సినిమా 55 రోజుల థియేట్రికల్ రన్‌లో ఇండియాలో ఏకంగా రూ. 181 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ. 269 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్, ప్రియదర్శన్ మార్క్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమయ్యాయి.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా డిజిటల్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈరోజు (జూన్ 12) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే మళ్లీ చూడాలనుకునే వారు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హారర్ కామెడీ రైడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. సౌత్ ఇండియన్ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రావడంతో దక్షిణాది ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపే అవకాశముంది.

ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, అర్జున్ (అక్షయ్ కుమార్), మీరా (మిథిలా పాల్కర్) అనే అన్నాచెల్లెళ్లకు తమ పూర్వీకుల నుంచి ఒక పురాతన ప్యాలెస్ వారసత్వంగా వస్తుంది. అయితే, ఆ ప్యాలెస్ ఉన్న ఊరిలో 'వధుసూర్' అనే ఒక దుష్టశక్తి పెళ్లికూతుళ్లను ఎత్తుకెళ్తుంటుంది. ఆ భయం వల్ల ఆ ఊరిలో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోరు. ఈ విషయం తెలియని అర్జున్, తన చెల్లెలి డెస్టినేషన్ వెడ్డింగ్‌ను అదే ప్యాలెస్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఆ బంగ్లాలో ఎలాంటి వింత పరిణామాలు జరిగాయి, ఆ దుష్టశక్తి నుంచి అర్జున్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే మిగతా కథ. 

బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో పరేష్ రావల్, జిస్సు సేన్‌గుప్తా, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామిఖ గబ్బి వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించారు. 

అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్‌లో 'హైవాన్' అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది. ఇది మోహన్‌లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ 'ఒప్పం' (2016) చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.